- మోడీ మార్కు అభివృద్ధి ఇదే
- కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా
న్యూఢిల్లీ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేతీ జై రాం రమేష్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ దేశ ప్రజలను పకోడీలు వేసుకొని బతకాలని ఉచిత సలహాలిస్తోందని, మరోవైపు దేశ వనరులను అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ మిత్రులకు హల్వాల్లా పంచి పెడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న టాప్ 10 కుబేరుల ఆదాయం.. దేశంలోని అట్టడుగు 10 శాతం ప్రజల మొత్తం ఆదాయం కంటే 6.8 రెట్లు అధికంగా ఆదాయాన్ని గడిస్తున్నారని చెప్పారు. వేతన అసమానతల విషయంలో పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ కంటే తీవ్రంగా భారత్ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ‘ఇది మన నాన్-బయోలాజికల్ ప్రధాని సృష్టించిన పకోడా-నామిక్స్ యొక్క ప్రత్యక్ష పరిణామమని గుర్తుంచుకోండి. సామాన్యులకు పకోడీలు, ఎంపిక చేసుకున్న కొందరికి హాల్వాలు’ అని సామాజిక మాధ్యమాల్లోనూ జైరాం రమేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.