ఎంపిగా జైరాం రమేష్‌ అనర్హుడు !

Feb 11,2024 11:18
  • ఆగ్రహంతో ఊగిపోయిన చైర్మన్‌ ధన్‌కర్‌

న్యూఢిల్లీ : ఆర్‌ఎల్‌డి చీఫ్‌ జయంత్‌ సింగ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌పై రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో వుండేందుకు కూడా ‘మీకు అర్హత లేదు’ అంటూ తీవ్రంగా మందలించారు. తన తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌కు భారత రత్న పురస్కారం ప్రకటించడంపై సభలో మాట్లాడేందుకు జయంత్‌ సింగ్‌ను అనుమతించాలని ధన్‌కర్‌ నిర్ణయించడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం జయంత్‌ మాట్లాడేందుకు వీల్లేదు. దీంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఫలితంగా పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో జైరాం రమేష్‌ ఏవో వ్యాఖ్యలు చేశారు. జయంత్‌పై చేసిన వ్యాఖ్యలకు రమేష్‌ను ఉద్దేశిస్తూ సభా చైర్మన్‌ హెచ్చరించారు. ”జయంత్‌తో జైరాం రమేష్‌ ఏమన్నారో నేను విన్నాను. శ్మశానంలో కూడా పండగ చేసుకోగల వ్యక్తి మీరు (రమేష్‌)” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏ నిబంధన కింద జయంత్‌కు అవకాశం ఇచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. భారతరత్నతో నేతలను గౌరవించడంపై చర్చే లేదన్నారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటనే ఏ నిబందన కింద అనుమతించారో కూడా చెప్పాలన్నారు. తమకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. కాగా ఖర్గే లేవనెత్తిన అభ్యంతరాల పట్ల ధన్‌కర్‌ అసంతృప్తి వ్యకం చేశారు. చరణ్‌ సింగ్‌ను, ఆయన వారసత్వాన్ని అవమానిస్తున్నారని ధన్‌కర్‌ అన్నారు.

➡️