న్యూఢిల్లీ : స్టార్‌లింక్‌తో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో భాగస్వామ్యంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఒప్పందాలను ఎలన్ మస్క్ ద్వారా అమెరికా అధ్యక్షులు ట్రంప్‌కు అనుకూలంగా మలిచేందుకు ప్రధాని మోడీ కుట్ర పన్నారని అన్నారు.
”అక్షరాలా 12 గంటల్లోనే ఎయిర్‌టెల్ మరియు జియో రెండూ స్టార్‌లింక్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీంతో భారతదేశంలోకి స్టార్‌లింక్ సులభంగా ప్రవేశించగలిగింది. అయితే గత కొంతకాలంగా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలన్నింటినీ పక్కకు పెట్టి ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. స్టార్‌లింక్ యజమాని ఎలమన్ మస్క్ ద్వారా ట్రంప్ దయ పొందేందుకు ప్రధాని మోడీ స్వయంగా ఈ భాగస్వామ్యాలను ఏర్పాటు చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది” అని అన్నారు.
కానీ చాలా ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానమివ్వాల్సి వుందని స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో జాతీయ భద్రత పరిస్థితి ఏమిటని ప్రధానిని ప్రశ్నించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కనెక్టివిటీని స్టార్ లింక్ లేదా భారతీయ భాగస్వామ్యులైన ఎయిర్‌టెల్, జియో సంస్థలు నియంత్రిస్తాయా ? ఇతర ఉపగ్రహ ఆధారిత కనెక్టివిటీ ప్రొవైడర్లు భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారా అయితే ఏ నిబంధనలపై అనే దానిపై ఆందోళన లేవనెత్తారు. స్టార్‌లింక్ ప్రవేశంతో భారతదేశంలో టెస్లా తయారీ ప్రణాళికలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అని ప్రధాని మోడీని నిలదీశారు.