కలవరపెడుతోన్న ఎయిమ్స్‌ ఫ్యాకల్టీ కొరత : జైరాం రమేశ్‌

Feb 5,2025 16:48 #AIIMS, #jai ram ramesh

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఫ్యాకల్టీ కొరత కలవరపెడుతోందని కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన ఇదే అంశాన్ని ఎత్తి చూపారు. రాజ్యసభలో ఎయిమ్స్‌ ఖాళీలపై తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేశవ్యాప్తంగా ఏడు ఎయిమ్స్‌ సంస్థలకు సంబంధించిన ఖాళీల భర్తీ వివరాలను మంగళవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇచ్చిన గణాంకాలు కలవరపెడుతున్నాయని బుధవారం ఎక్స్‌ పోస్టులో జైరాం రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ న్యూఢిల్లీ, భోపాల్‌, భువనేశ్వర్‌, జోద్‌పూర్‌, రారుపూర్‌, పాట్నా, రిషికేశ్‌లలో ఫ్యాకల్టీ రేటు 24 శాతం నుండి 39 శాతం వరకు ఉన్నాయని రమేష్‌ చెప్పారు. రాజ్‌కోట్‌ ఎయిమ్స్‌లో 59.5 శాతం, బిలాస్‌పూర్‌లో 54 శాతం మేర ఖాళీల భర్తీ ఉంది. ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్‌లో కూడా ఖాళీలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆయన అన్నారు. ఎయిమ్స్‌లో ఉన్న ఖాళీలు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినదే కాదు… అధ్యాపకుల నాణ్యతను కూడా ఎత్తిచూపుతుందని ఆయన విమర్శించారు.
కాగా, ఎయిమ్స్‌లో భర్తీ చేయాల్సిన ఖాళీలపై జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ స్పందించింది. ఎయిమ్స్‌ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

➡️