జమిలి అప్రజాస్వామికం

  • ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలంటూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలు పార్లమెంటరీ వ్యవస్థను మంటగలుపుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అధికార వికేంద్రీకరణను, ప్రజాస్వామ్యంలో ప్రజా భాగస్వామ్యాన్ని ధ్వంసం చేసే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలును కేంద్రం ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్‌ చేసింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలన్న అత్యున్నత స్థాయి కమిటీ సూచన దేశంలో వైవిధ్యానికి తావు లేకుండా చేస్తుందని తీర్మానం ప్రవేశపెడుతూ మంత్రి ఎంబి రాజేష్‌ పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఐదేళ్లు పూర్తికాని శాసనసభల కాలపరిమితిని తగ్గించాలని అత్యున్నత కమిటీ ప్రతిపాదించిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను, ఎన్నుకున్న ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తుందని, ప్రజల సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ సమాఖ్య నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ కర్తవ్యాన్ని అతిక్రమించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని గద్దె దించి, అసెంబ్లీని రద్దు చేస్తే, ఉప ఎన్నికల ద్వారా ఏర్పడే అసెంబ్లీకి గత ప్రభుత్వ పదవీకాలం మాత్రమే మిగిలి ఉంటుందని కమిటీ సిఫార్సు చేస్తోందని విమర్శించారు. ఇది ఖర్చు తగ్గించే చర్య అనే వాదనకు విరుద్ధంగా ఉందని, ఎన్నికలను ఖర్చుగా చూడడం అప్రజాస్వామికంమని అన్నారు. ఇది సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే, రాష్ట్రాల హక్కులను హరించి, ప్రజల సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే చర్య అని చెప్పారు. కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థను సాకారం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఎజెండాను అమలు చేసే ప్రయత్నమిదని విమర్శిం చారు. ఇది శాసనసభ అధికారాలను, హక్కులను నిర్వీర్యం చేస్తుందని కూడా తీర్మానంలో పేర్కొన్నారు.

➡️