Jammu and Kashmir : గడిచిన 32 నెలల్లో 48 మంది జవాన్లు మృతి

న్యూఢిల్లీ :    జమ్ముకాశ్మీర్‌లోని జమ్ము ప్రాంతంలో గత 32 నెలల్లో ఎన్‌కౌంటర్‌లలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 48కి చేరినట్లు అధికారులు తెలిపారు.  దొడా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

అధికారుల సమాచారం ప్రకారం.. దొడా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు భారత ఆర్మీ, జమ్ముకాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారని, దీంతో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని ఆర్మీ కార్ప్స్‌ సోమవారం రాత్రి ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని తెలిపింది.

ఇటీవల జరిగిన ప్రధాన దాడులు
జులై 16, 2024 : దొడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మృతి

జులై 8, 2024 : కతువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై  జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

జూన్‌ 11-12, 2024 :  జంట దాడుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

జూన్‌ 9, 2024 :  రియాసి జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు.

మే 4, 2024 : పూంచ్‌ జిల్లాలో ఐఎఎఫ్‌కి చెందిన రెండు వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వైమానిక దళానికి చెందిన ఓ సైనికుడు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

డిసెంబర్‌ 21,2023 :  ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మృతి

నవంబర్‌ 2023 : ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు జవాన్లు మృతి

ఏప్రిల్‌-మే 2023 :  జంట దాడుల్లో పది మంది జవాన్లు మృతి

మే 2022 : కత్రాలో యాత్రికుల బస్సుపై దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

డిసెంబర్‌ 2021 : నలుగురు సైనికులు మృతి

➡️