మంచులో చిక్కుకున్న జవాన్‌

Sep 20,2024 00:09 #jawan, #snow, #stuck
  • మూడు రోజుల తర్వాత రక్షించిన రెస్క్యూ సిబ్బంది

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తూ అదృశ్యమైన సైనికుడిని, పోర్టర్‌ను మూడు రోజుల తరువాత రెస్క్యూ సిబ్బంది రక్షించారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన అనిల్‌ రామ్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. భారత్‌-చైనా సరిహద్దులో మున్సియారి నుంచి మిలామ్‌ వరకు గస్తీ కోసం మోహరించిన బృందంలో ఉన్నాడు. మూడు రోజుల కిందట జవాన్‌ అనిల్‌ రామ్‌, పోర్టర్‌ దేవేంద్ర సింగ్‌ కనిపించకుండా పోయారు. ఈ విషయం తెలిసి వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ ప్రాంతంలో వెతికింది. జవాన్‌ అనిల్‌, అతడి పోర్టర్‌ దేవేంద్ర సింగ్‌, భారీ మంచు కారణంగా దారి తప్పారు. మంచులో చిక్కుకున్న వారిద్దరూ మున్సియారీకి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలో మూడు రోజులుగా ఆశ్రయం పొందారు. రెస్క్యూ బృందం 36 గంటలపాటు వారి కోసం వెతికింది. ఎట్టకేలకు మూడో రోజు అనిల్‌, దేవేంద్రలను గుర్తించారు. మంచుతో కప్పి ఉన్న గుహ నుంచి వారిని కాపాడారు. జవాన్‌ అనిల్‌ను ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

➡️