అగ్నిపథ్‌ స్కీంపై జెడియు అభ్యంతరం : కె.సి త్యాగి

Jun 6,2024 16:36 #jdu, #KC Tyagi, #national

న్యూఢిల్లీ : ఎన్‌డిఎ కూటమికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పార్టీ జెడియు పూర్తి మద్దతిస్తోంది. త్వరలో ఏర్పడబోయే ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటుకు జెడియు కీలకంగా మారింది. అయితే మోడీ మరోసారి ప్రమాణస్వీకారం చేయకముందే.. జెడియు నేతలు ఎన్‌డిఎ హయాంలోని కొన్ని కీలక పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా యుసిసి (ఉమ్మడి పౌరస్మృతి), అగ్నివీర్‌ స్కీంలను అమలు చేస్తామని బిజెపి నేతలు ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం జెడియు నేత కె సి త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్‌డిఎ అమలు చేయాలనుకుంటున్న అగ్నివీర్‌ పథకంపై ఓ వర్గం ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ పథకంపై ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలను వివరంగా చర్చించి, వాటిని సరిదిద్దాలని మా పార్టీ కోరుతోంది. అలాగే ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి కూడా మేము వ్యతిరేకం కాదు. దీనిపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాలని మేము భావిస్తున్నాము.’ అని ఆయన అన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణనకు ప్రధాని మోడీ కూడా వ్యతిరేకం కాదు. బీహార్‌ ప్రజలు కూడా కులగణనను కోరుతున్నారు. అందుకే దాన్ని తాము కొనసాగిస్తామని త్యాగి తెలిపారు.

➡️