ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శిగా జితేంద్ర చౌదరి తిరిగి ఎన్నికయ్యారు. 60 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. వారిలో 14 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం ఎన్నికైంది. త్రిపుర రాజధాని అగర్తలాలో మూడు రోజులపాటు జరిగిన సిపిఎం త్రిపుర రాష్ట్ర 24వ మహాసభ శుక్రవారం ముగిసింది. ఈ మహాసభకు సిపిఎం సమన్వయకర్త ప్రకాశ్‌కరత్, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్, అశోక్ ధావలే, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి రాజకీయ, నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై 45 మంది ప్రతినిధులు చర్చించారు. అనంతరం మహాసభ ఏకగ్రీవంగా నివేదికను ఆమోదించింది. నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది. రాష్ట్ర కార్యదర్శిగా జితేంద్ర చౌదరి తిరిగి ఎన్నికయ్యారు. 60 మందితో రాష్ట్ర నూతన కమిటీ, 14 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం ఎన్నికైంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది.
