యుపిలో జర్నలిస్టు దారుణ హత్య

హంతకుల అరెస్టుకు కుటుంబ సభ్యుల డిమాండ్‌
అంత్యక్రియలకు నిరాకరణ

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. వాహనంతో ఢకొీట్టి.. కాల్పులు జరిపి ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, భూమి కొనుగోళ్లలో స్టాంప్‌ డ్యూటీ ఎగవేత వంటి అంశాలపై వార్తలను రాసిన సీతాపూర్‌లో ఒక హిందీ దిన పత్రిక జర్నలిస్టు రాఘవేంద్ర బాజ్‌పేరు (35) ఆర్‌టిఎ కార్యకర్త కూడా. ఆయనకు శనివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఫోన్‌ వచ్చింది. దీంతో ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. లక్నో-ఢిల్లీ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ రాఘవేంద్రను ఒక వాహనం ఢకొీట్టింది. ఆ తర్వాత అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. రక్తం మడుగులో పడి ఉన్న రాఘవేంద్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్టుగా తొలుత పోలీసులు భావించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా అతడి శరీరంలో నాలుగు తూటాలున్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో జర్నలిస్ట్‌ రాఘవేంద్రను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. హత్య అభియోగాలపై గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు లక్నో రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశా మన్నారు. రాఘ వేంద్ర కాల్‌ రికార్డులను పరి శీలిస్తున్నామని, సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం పంపామని చెప్పారు. పోస్టుమార్టర తరువాత రాఘవేంద్ర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హంతకుల్ని అరెస్టు చేసేవరకూ అంత్యక్రియలు చేయడానికి బంధువులు నిరాకరిస్తుండగా, అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. రాఘవేంద్ర కుటుంబానికి పరిహారం ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
సీతాపూర్‌లోని మహోలి ప్రాంతంలో వ్యవసాయాధార కుటుంబానికి చెందిన బాజ్‌పేరు పదేళ్లుగా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. బాజ్‌పేరు అన్నయ్య 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులకు కూడా ఆయనే ఆధారం. స్థానిక అక్రమార్కులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే బాజ్‌పేరును హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️