జమిలి ఎన్నికలపై జెపిసి తొలి భేటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) బుధవారం నాడిక్కడ తొలిసారి సమావేశమైంది. జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపైన ఇది దృష్టి సారించనుంది. బిజెపి ఎంపి పిపి చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల కమిటీ పార్లమెంట్‌ భవనంలో జరిపిన ఈ ప్రారంభ సమావేశానికి కేంద్ర శాసన, న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు హాజరై ప్రభుత్వ వాదనను వినిపించారు. అదే సమయంలో సిపిఎం సభ్యులు కె. రాధాకృష్ణన్‌తో సహా ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఓ పెద్ద సూట్‌కేస్‌లో 18వేలకు పైగా పేజీల పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు.జమిలి ఎన్నికలపై ప్రతిపక్ష, బిజెపి ఎంపిల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సిపిఎం నేత రాధాకృష్ణన్‌, ఆప్‌ నేత సంజరు సింగ్‌, టిఎంసి నేత కళ్యాణ్‌ బెనర్జీతో సహా ప్రతిపక్ష ఎంపిలు ఖర్చు తగ్గుతుందనే అంశాన్ని ప్రశ్నించారు. మరోవైపు బిల్లుల్లోని నిబంధనలను బిజెపి ఎంపిలు సమర్థించారు. కాంగ్రెస్‌, టిఎంసి, సిపిఎం, డిఎంకె, ఆప్‌ తదితర పార్టీలు బిల్లుల్లోని రాజ్యాంగ ఉల్లంఘలను ఎత్తి చూపారు. ”నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధంగానూ, ఫెడరలిజంపై దాడి చేసే విధంగానూ ఉన్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు. ”డబ్బు ఆదా చేయడం కంటే ప్రజల ప్రజాస్వామ్య హక్కులను సమర్థించడం చాలా ముఖ్యం” అని స్పష్టం చేశారు. బిల్లులు రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించడానికి జెపిసికి కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపిలు సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు (ఇవిఎం) అవసరమని కాంగ్రెస్‌ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కాని సంస్కరణ అని, ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సిపిఎం ఎంపి కె. రాధాకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులు రాష్ట్రాల అధికారాలను లాక్కుంటూ సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

➡️