సిజెఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా రేపు బాధ్యతల స్వీకరణ

  • రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం
  • నేటితో ముగియనున్న జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజెఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ చంద్ర చూడ్‌ పదవికాలం ఆదివారంతో ముగియనుంది. దీంతో శుక్రవారం చివరి వర్కింగ్‌ డే కావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నూతన సిజెఐగా సంజీవ్‌ ఖన్నా బాధత్యలు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం సుప్రీంకోర్టుకు చేరుకోనున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా… కోర్టు నెంబర్‌ 1లో సిజెఐగా హోదాలో కేసులను విచారించున్నారు. కాగా సిజెఐ జస్టిస్‌ చండ్రచూడ్‌ సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు తదుపరి సిజెఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను నియమిస్తూ గత నెల 25న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మార్నింగ్‌ వాక్‌ వదులుకున్న నూతన సిజెఐ

నూతన సిజెఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తనకు అత్యంత ఇష్టమైన మార్నింగ్‌ వాక్‌ ను వదులుకున్నారు. భద్రతా, ఇతర కారణాల దృష్ట్యా రోజువారిగా లోధీ గార్డెన్‌ లో చేసే మార్నింగ్‌ వాక్‌ కు దూరం కానున్నారు. 1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఢిల్లీ యూనివర్శిటీలో లా పూర్తి చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత ఏడాదినే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. అలా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఎదిగారు. ప్రస్తుత సిజెఐ చంద్రచూడ్‌, ఇతర సీనియర్‌ న్యాయమూర్తులతో కలిసి చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఇందులో ఎన్నికల బాండ్లు, ఆర్టికల్‌ 370 రద్దు, ఇవిఎంల వినియోగం వంటి తీర్పులు వెలువరించారు.

➡️