న్యూఢిల్లీ : జస్టిస్ యశ్వంత్ వర్మ నగదు వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.అత్యవసర జాబితా కోసం కేసులను మౌఖికంగా ప్రస్తావించే పద్ధతిని నిలిపివేయడంతో .. ఈ పిటిషన్ విచారణకు వస్తుందని సిజెఐ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ఎఫ్‌ఐఆర్ అవసరమని న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇది సరిపోతుందని, పిటిషన్ తదనుగుణంగా విచారణకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
ఈ పిటిషన్ విస్తృత ప్రయోజనాలకు సంబంధించినందున అత్యవసర విచారణ కోసం బెంచ్ ముందు జాబితా చేయాలని న్యాయవాది మాథ్యూస్ జె. నెడుంపరా సిజెఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. ఇటువంటి కేసు ఒక సాధారణ పౌరుడిపై ఉంటే సిబిఐ, ఈడి వంటి అనేక దర్యాప్తు సంస్థలు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టేవని ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న ఒక మహిళ కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సహా మరో ముగ్గురు ఆదివారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.