ఢిల్లీ : కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు ”కల్లక్కడల్” హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 15 రాత్రి ఈ రెండు రాష్ట్రాల్లో ”కల్లక్కడల్” (అకస్మాత్తుగా దొంగలా వచ్చే సముద్రం అని అర్ధం) అలలు సాధారణం కన్నా ఎక్కువ వేగంగా, ఎత్తుతో ఎగిసిపడుతుంటాయని తెలిపింది. మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ ప్రాంతాల్లో 0.5 నుంచి 1.0 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. మత్స్యకారులతో పాటు తీర ప్రాంతా ప్రజలు ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు మారాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతంలోని చిన్న పడవలు, కంట్రీ బోట్లు సముద్రంలోకి వెళ్లవద్దని, ఫిషింగ్ బోట్లను తీరంలో సురక్షితంగా లంగరు వేసి ఉంచాలని అధికారులు సూచించారు.
