Kancha Gachibowli lands – ‘సమర్థించుకోవద్దు.. జైలుకెళ్లాల్సి వస్తుంది’ : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ భూముల్లోని చెట్ల నరికివేతపై జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా ?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు ?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతామని చురకలు అంటించింది. షెల్టర్‌ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్‌ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్‌ లంగ్‌ స్పేస్‌ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15 కు వాయిదా వేసింది.

➡️