Kangana vs Himachal Minister : రెండు నెలల విద్యుత్‌ బిల్లు చెల్లించలేదు

సిమ్లా :   బాలీవుడ్‌ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ రెండు నెలల విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ బోర్డ్‌ (హెచ్‌పిఎస్‌ఇబి) స్పష్టం చేసింది. రెండు నెలల విద్యుత్‌ బకాయిల మొత్తం రూ.90,384 ఉందని తెలిపింది. మేడమ్‌ బిల్లులు చెల్లించకపోగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించారని రాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి విక్రమాదిత్య సింగ్‌ మండిపడ్డారు.
మనాలిలోని తన ఖాళీ నివాసానికి నెలకు లక్ష రూపాయల విద్యుత్‌ బిల్లు వచ్చిందని ఇటీవల మండిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.

మేడమ్‌ విద్యుత్‌ బిల్లులు కట్టరని, బహిరంగవేదికలపై ప్రభుత్వాన్ని దూషిస్తారని మంత్రి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలకు చెందిన బిల్లులు రూ.90,384 అని, వాటిలో గతంలో రూ.32,287 కూడా ఉన్నాయని హెచ్‌పిఎస్‌ఇబి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మనాలిలోని సిమ్సా గ్రామంలోని కంగనారనౌత్‌ నివాసంలో ఆమె పేరు మీద 100000838073 నెంబర్‌ కింద విద్యుత్‌ కనెక్షన్‌ ఉందని తెలిపింది. విద్యుత్‌ కనెక్టెడ్‌లోడ్‌ 94.82 కెడబ్ల్యు అని, సాధారణ నివాస సగటు విద్యుత్‌ లోడ్‌ కన్నా 1500 శాతం ఎక్కువని పేర్కొంది. అక్టోబర్‌, డిసెంబర్‌ వరకు కంగనా బిల్లులను సకాలంలో చెల్లించలేదని ఆ ప్రకటనలో తెలిపింది.

➡️