మళ్లీ నోరు జారిన కంగనా రనౌత్‌

  • జాతిపిత అంటూ ఎవరూ లేరని గాంధీ జయంతి రోజే ట్వీట్‌

న్యూఢిల్లీ : వివాదస్పద బిజెపి ఎంపి, నటి కంగనా రనౌత్‌ మరోమారు నోరు జారారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కొత్త వివాదాన్ని లేవదీశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి 120వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ, జాతిపితగా మహాత్ముని స్థాయిని కించపరిచేలా ఆమె పోస్టు పెట్టారు. ”జాతిపిత అంటూ ఎవరూ లేరు, వున్నదల్లా పుత్రులే, వీరందరూ భరతమాత పుత్రులు’ అని ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దేశంలో పరిశుభ్రతపై మహాత్ముని వారసత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు తీసుకెళుతున్నారని ఆ తర్వాత మరో పోస్టులో పేర్కొన్నారు. కాగా, గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ కంగనా పోస్టులపై కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రినెట్‌ తీవ్రంగా విమర్శించారు. ‘గాడ్సే ఆభిమానులు బాపూ, శాస్త్రీజీల మధ్య తేడాల గురించి చెబుతున్నారు. ఈ కొత్త గాడ్సే భక్తురాలిని నరేంద్ర మోడీగా మనస్ఫూర్తిగా క్షమిస్తారా? జాతి పిత వున్నారు. పుత్రులు వున్నారు, అమరులు వున్నారు, ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాల్సిందే.’ అని సుప్రియా శ్రినెట్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. పంజాబ్‌కి చెందిన మరో సీనియర్‌ బిజెపి నేత మనోరంజన్‌ కలియా కూడా రనౌత్‌ తాజా వ్యాఖ్యలను విమర్శించారు. వివాదాస్పద ప్రకటనలు చేయడం ఆమెకు అలవాటుగా మారిందన్నారు.

➡️