చెన్నై : గత కొన్నిరోజులుగా త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిఎంకె ఎంపీలు అనాగరికులు, అప్రజాస్వామికుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే పిఎం శ్రీ పథకం విషయంలో తమిళనాడు అంగీకరించి ఆపై వెనక్కి తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తమిళనాడు సమ్మతించినట్లు గతేడాది మార్చి 15వ తేదీన లేఖను ధర్మేంద్ర విడుదల చేశారు. ధర్మేంద్ర లేఖపై బుధవారం డిఎంకె ఎంపి కనిమొళి స్పందించారు. పిఎం శ్రీ పథకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం లేఖను ఆమె ఎక్స్ పోస్టులో షేర్ చేశారు. ఈ లేఖలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పిఎం శ్రీ పథకం అమలుకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల ఆధారంగా మాత్రమే అంగీకరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా కాదని ఈ లేఖ స్పష్టంగా పేర్కొందని కనిమొళి తెలిపారు. త్రిభాషా విధానం, ఎన్‌ఇపిని పూర్తిగా అంగీకరించినట్లు మేము ఎక్కడా ఈ లేఖలో ప్రస్తావించలేదు. తమిళనాడుకి ఏది ఆమోదయోగ్యమో మేము దాన్నే అంగీకరిస్తాం.. ఈ విషయంలో ఎక్కువ కాదు.. తక్కువ కాదు. ధర్మేంద్ర ప్రధాన్ వాస్తవాలను వక్రీకరించడం ఆపండి అని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
