బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సంపాదించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె శివకుమార్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్నికల ఫలితాల సమీక్షకు సంబంధించి పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా డి.కె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో 14 లేదా 15 సీట్లలో విజయం సాధిస్తామని అంచనా వేశాం. కానీ మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందుకెళతాము. రాష్ట్రంలో బిజెపి, జెడిఎస్‌లు రాబోయే రోజుల్లో కలిసి పోరాడతాయని నాకు తెలుసు. ఈ రెండు పార్టీలను నిలువరించేందుకు ఏం చేయాలనేదానిపైనే కసరత్తు సాగిస్తున్నాము.’ అని ఆయన అన్నారు.
కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకుగాను కర్ణాటకలోని కాంగ్రెస్ 9 స్థానాల్లోనే గెలిచింది. 19 స్థానాల్లో బిజెపి, జెడియు పార్టీలు గెలిచాయి.
Karnataka : లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.. సమీక్షించుకుంటున్నాం : డి.కె శివకుమార్
