Kathua terror attack: పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని అరికట్టాలి : ఫరూక్‌ అబ్దుల్లా

పూన్చ్‌ (జమ్మూ అండ్‌ కాశ్మీర్‌) : పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని అరికట్టాలని జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కోరారు. కాశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఫరూక్‌ అబ్దుల్లా ఖండించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం ఎవరికీ సహాయం చేయదు. మన పొరుగు దేశం (పాకిస్తాన్‌) ఉగ్రవాదులను సరిహద్దు దాటి పంపడం ద్వారా మార్పు తీసుకువస్తుందని భావిస్తే అది ఎప్పటికీ జరగదు. ఈరోజు జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలర్పించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటప్పుడు ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య ఎలా పరిష్కారమవుతుంది? దయచేసి ఈ ఉగ్రవాదాన్ని ఆపండి. ఉగ్రవాదమనేది ప్రపంచంలో ఎక్కడైనా ఖండించబడుతుంది. నేడు ప్రపంచంలో ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మీరు (పాకిస్తాన్‌) ఉగ్రవాదానికి పాల్పడడం ద్వారా ఏమి సాధిస్తున్నారు? ఉగ్రవాదం వల్ల మరణించిన సైనికుల కుటుంబాలు నేడు శోక సంద్రంలో మునిగాయి.’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇరు దేశాలు చర్చిస్తాయా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఫరూక్‌ ‘ఉగ్రవాదం ఆగిపోయినప్పుడే చర్చలు జరుగుతాయి. మేము కూడా చర్చలకు సానుకూలంగా ఉన్నాము. ఇరు దేశాల మధ్య కచ్చితంగా చర్చలు జరగాలి. కాకపోతే అంతకంటే ముందు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

➡️