సిబిఐ విచారణపై కవిత సవాల్‌

– రౌస్‌ అవెన్యూ కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్‌ జైలులో ఉంటున్న తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణకు అనుమతించడాన్ని బిఆర్‌ఎస్‌ నేత కవిత సవాలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత తరపున సీనియర్‌ న్యాయవాది నితీష్‌ రాణా శనివారం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు అనుమతిస్తూ జారీ చేసినఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సిబిఐ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని న్యాయమూర్తికి వివరించారు. ఢిల్లీ మద్యం విధానం వ్యవహారంలో కవితను విచారించాల్సి ఉన్నదని, దీనికి అనుమతి కావాలని సిబిఐ కోరగా అందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, కనీసం ఆ పిటిషన్‌ కాపీ కూడా మాకు చేరలేదని కవిత తరుపున న్యాయవాది పేర్కొన్నారు. అయినప్పటికీ సిబిఐ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చిందని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమైన ఈ ఉత్తర్వులను తాము సవాలు చేస్తున్నామని, ఆ ఉత్తర్వులపై తక్షణమే స్టేటస్‌ కో విధించాలని అభ్యర్థించారు. అయితే కవిత అభ్యర్థనను రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా నిరాకరించారు. కౌంటర్‌ పిటిషన్‌ పై వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని పేర్కొన్నారు. కవిత పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సిబిఐ మూడు రోజులు వరకు సమయం కోరింది. తదుపరి విచారణను ఈనెల 10న చేపట్టనున్నారు.

➡️