- ఢిల్లీ మాజీ సిఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగే లోగా బిజెపి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని అమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. అలా చేస్తే ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. జార్ఖండ్, మహారాష్ట్రతో పాటే నవంబరులో ఢిల్లీ శాసనసభకు కూడా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఆదివారం నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ రాష్ట్రాలలో బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో బిజెపి ఓటమి తప్పదని అన్నారు.
డబుల్ ఇంజిన్ అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం
బిజెపి చెబుతున్న ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు త్వరలోనే కుప్పకూలుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యుత్, నీరు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు పుణ్యక్షేత్రాల సందర్శన, ఆరోగ్య రక్షణ, విద్య…వంటి ఆరు ఉచిత సేవలు అందించిందని చెప్పారు. ప్రజలు పొరబాటున బిజెపికి ఓటేస్తే ఈ ఆరు ప్రయోజనాలూ కోల్పోతారని హెచ్చరించారు. ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వస్తే డిటిసి, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు ప్రైవేటు పరం అవుతాయని ఆరోపించారు. మణిపూర్‌లో ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి ఆ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిందని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్‌ను ఆయన డబుల్ దోపిడీ…డబుల్ అవినీతిగా అభివర్ణించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఢిల్లీలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని అంటూ రాష్ట్రాన్ని ‘ఎల్జీ రాజ్’ నుండి విముక్తి చేస్తామని, రాష్ట్ర హోదా కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.