ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సిబిఐ చార్జ్‌షీట్‌లో పలు పేజీల మిస్సింగ్, ఖాళీలపై ప్రతివాదులు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి ఇవ్వాలని సిబిఐ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు ట్రయల్ కోర్టు వెల్లడించింది. ఈ కేసు వ్యవహారంలో గతేడాది జూన్ 7న కవితతో పాటు, మరో నలుగురిపై సిబిఐ సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అమన్ డీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రులపై సిబిఐ అదనపు చార్జ్‌షీట్ వేసింది. ఈ చార్జ్‌షీట్లపై శుక్రవారం మరోసారి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కవితతోపాటు, కేజ్రీవాల్, సిసోడియా, ఇతర సహ నిందితులు వర్చువల్ మోడ్‌లో కోర్టు ముందు హాజరయ్యారు.