Kejriwal : ఐదేళ్లలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం

  • ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రాధాన్యత. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మా బృందం ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే, మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించాం. ఉపాధి ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
యోగీ.. యుపిలో విద్యుత్‌ కోతల మాటేమిటి?
ఆప్‌ పాలనలో ఢిల్లీని డంపింగ్‌ యార్డులా మార్చేశారని, 24 గంటల విద్యుత్‌ అందించడంలేదంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల చేసిన ఆరోపణలను కేజ్రీవాల్‌ తిప్పికొట్టారు. గురువారం పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌లో ఆప్‌ అభ్యర్థి తరఫున నిర్వహించిన ప్రచార సభలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌లో కరెంటు కోతల మాటేమిటని? యోగిని ఆయన ప్రశ్నించారు. ‘నేను చాలా మందిని అడిగా. ఢిల్లీలో 24 గంటలూ విద్యుత్‌ అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఆప్‌ సర్కార్‌ ఢిల్లీలో పదేళ్లుగా ఉంది. ఐదేళ్లలోనే 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురాగలిగాం. యుపిలో బిజెపి ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం రోజుకు ఎన్ని గంటలు విద్యుత్‌ అందిస్తోందో? యోగిజీ పరిశీలించుకోవాలి’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

➡️