న్యూఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తలపై బిజెపి దాడి చేసిందంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘం (ఈసి)కి ఆదివారం లేఖ రాశారు. తన నియోజకవర్గంలో స్వతంత్ర పరిశీలకులను నియమించాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కార్యకర్తలపై జరిగిన కొన్ని ఘటలను కూడా లేఖలో ఉదహరించారు. శనివారం రోహిణి ప్రాంతంలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్‌పై దాడి జరిగినట్లు తెలిపారు. సెక్టార్ 2లోని పాకెట్ హెచ్‌లో స్థానికులతో గోయల్ సంభాషిస్తుండగా ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కార్యకర్తలపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారని, ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని రాజ్యసభ ఎంసి సంజయ్ సింగ్ కూడా శనివారం ఈసికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి8న ఫలితాలు వెలువడనున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్‌పై బిజెపి నుండి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుండి సందీప్ దీక్షిత్‌లు పోటీ పడుతున్నారు.