న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కేంద్రం లాక్కుందని ఢిల్లీ సిఎం అతిషీ మంగళవారం ప్రకటించారు. ”ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ రోజు ప్రకటించారు. గత రాత్రి, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో రెండవసారి, నాకోసం కేటాయించిన అధికారిక నివాసం నుండి నన్ను బయటకు నెట్టించింది. ఓ లేఖ ద్వారా సిఎం నివాసం కేటాయింపును రద్దు చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుండి, ఎన్నుకున్న సిఎం నుండి నివాసాన్ని బిజెపి లాక్కుంది ” అతిషీ పేర్కొన్నారు.
బిజెపి తన పైన దాడిని కొనసాగిస్తూనే ఉందని, మూడు నెలల క్రితం తనను నివాసం నుండి బయటకు పంపారని అన్నారు. తాను సిఎంగా ఎన్నికైన తర్వాత తనతో పాటు తన కుటుంబం రోడ్డున పడేలా చేశారని మండిపడ్డారు. తమ నివాసాలను లాక్కోవడం, తమను దుర్భాషలాడటం, కుటుంబసభ్యులను అవమానపరచడం ద్వారా తమను అడ్డుకోవాలని బిజెపి చూస్తోందని, కానీ తమను ఎవరూ అడ్డుకోలేరని ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని అన్నారు.
ఢిల్లీ ప్రజలపై బిజెపికి శ్రద్ధ లేదని, కేవలం ఆప్ నేతలను అడ్డుకోవడమే కేంద్రం పని అని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.