వయనాడ్ సహాయంపై ‘ది హిందూ’ ఇంటర్వ్యూలో పినరయి విజయన్
ఆర్‌ఎస్‌ఎస్, ఇతర హిందూత్వ శక్తులను సిపిఎం ఎప్పుడూ గట్టిగా వ్యతిరేకిస్తూనే వస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కేరళలోని మైనారిటీ ఓటు బ్యాంక్ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్) వైపునకు మళ్లుతోందనే విషయమై ఆందోళన చెందుతున్న ప్రతిపక్షమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్)తో సిపిఎం కుమ్మక్కైందని ఆరోపణలు చేస్తోందని విజయన్ పేర్కొన్నారు. వయనాడ్‌కు సహాయం అందజేయడంలో కేంద్రం అసాధారణ జాప్యం చేస్తోందని తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం కోసం ఢిల్లీలో వున్న విజయన్ ‘ది హిందూ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
కేవలం ప్రతిపక్షమే కాకుండా, సమాజంలో చీలికలు సృష్టించాలని, కేరళలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని కోరుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్, ముస్లిం తీవ్రవాద శక్తులు రెండూ కూడా ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయన్నారు. బంగారం అక్రమ రవాణా, హవాలా మనీపై పోలీసుల అణచివేత చర్యల వల్ల కలిగిన అసంతృప్తి తోనే ఈ ఆరోపణలు కూడా చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బిజెపి ఓటు షేర్ వాటా కూడా పెరగడం మరో ఆందోళన కరమైన అంశంగా మారిందన్నారు. ఇందుకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలని విజయన్ పేర్కొన్నారు.
”బిజెపి త్రిస్సూర్‌లో గెలిచిందంటే, అక్కడ మేం పట్టు కోల్పోవడం వల్ల కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 86,965 ఓట్లు తక్కువ వచ్చాయి. ఈసారి ఎల్‌డిఎఫ్ ఓటు వాటా స్వల్పంగా 16,196 ఓట్లు పెరిగాయి.” అని విజయన్ పేర్కొన్నారు.
జులై 30న వయనాడ్‌లో అనూహ్యమైన రీతిలో విధ్వంసం చోటు చేసుకుంది. పునరావాసానికి అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేసిందా? ఇప్పటివరకు కేంద్రం స్పందన ఎలా వుంది?
కేంద్రం తొలి స్పందన బాగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. వయనాడ్‌లో ఎక్కువ సమయం గడిపారు. పునరావాసానికి అవసరమైన చర్యలపై మేం సవివరమైన మెమోరాండం అందజేశాం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలపై ఆర్థిక, ఇతరత్రా సహాయం ఆధారపడివుంటుంది. ఈ మార్గదర్శకాల కింద ఇవ్వజూపేవి, వాస్తవంగా మాకు అవసరమైన వాటికి మధ్య చాలా అంతరం వుంటుంది. మేమిచ్చిన మెమొరాండం గురించి గుర్తు చేయడానికి ఇటీవలే ప్రధాని మోడీని కలిశాను. కేంద్రం దాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. కానీ, ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలపడంలో ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇక ఇతరత్రా సందర్భాల్లోనూ కేంద్రం అసాధారణ అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది.
”అనేక నియోజకవర్గాల్లో సాంప్రదాయసిద్ధంగా సిపిఎంకు వున్న పట్టుకు కొంతమేరకు కోత పడిందని, అది బిజెపికి మళ్లిందని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సిపిఎం కేంద్ర కమిటీ చేసిన సమీక్ష గుర్తించింది. పైగా హిందూత్వ రాజకీయాలను ఎదుర్కోవడంలో పార్టీ తగినంత దృష్టి పెట్టలేదని భావించబడింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సిపిఎం తిరిగి ఒక్క సీటుకే పరిమితమైంది. దీనిపై మీ జవాబు ఏమిటి?
సమీక్షలో అలా పేర్కొందని నేను అనుకోవడం లేదు. కేరళలో హిందూత్వ రాజకీయాలను సిపిఎం సమర్ధవంతంగా ఎదుర్కొనలేకపోతోంది అనడం కరెక్టుకాదు. బిజెపి ఓటు షేర్ పెరిగిందన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలపై మేం మా వైపు నుండి ఏం తప్పు జరిగిందనేది ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం. అయితే బిజెపి గెలిచిన ఆ ఒక్క సీటు త్రిస్సూర్ ఫలితాన్ని నిశితంగా పరిశీలించినట్లైతే, అక్కడ మేం పట్టు కోల్పోవడం వల్ల ఇది జరగలేదని మీకు అర్ధమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 86,965 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. మరోవైపు, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్)కు ఓటు షేర్ స్వల్పంగా 16,196 ఓట్ల మేర పెరిగింది.
కానీ, వామపక్ష ఓటరు బిజెపి వైపునకు మళ్లాడని కేంద్ర కమిటీ డాక్యుమెంట్ చెబుతోంది కదా.
ఎల్‌డిఎఫ్‌కు బాసటగా నిలబడే మా మద్దతుదారుల్లోని కొన్ని తరగతులు ఎన్నికల సందర్భంగా భిన్నమైన ఎంపికలను చేసుకుంటాయి. బిజెపిని ఓడించేందుకే వారు ఓటు వేశారు. కేంద్రంలో బిజెపిని నిలువరించేందుకు కాంగ్రెస్ మెరుగని వారు విశ్వసించారు. అందువల్లే వారు మాకు మద్దతివ్వడానికి బదులు కాంగ్రెస్ వైపు మొగ్గారు. అయితే, మాతో కలిపి పయనించేవారిలో చాలామంది కాంగ్రెస్‌కు మద్దతిచ్చినప్పటికీ ఆ పార్టీ బిజెపిని నిలువరించలేకపోయిందన్నది వాస్తవం. త్రిస్సూరే దీనికి చక్కటి ఉదాహరణ. అలా అని మేం ఆత్మసంతృప్తి చెందడం లేదు. మా వైఫల్యాన్ని సొమ్ము చేసుకుని బిజెపి ఓట్లు దక్కించుకుందా అన్న అంశంపై ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం.
రెండు ధ్రువాల రాజకీయ వ్యవస్థ నెలకొన్న రాష్ట్రంలో బిజెపి మూడో ధ్రువంగా ఎదుగుతోందని మీరు భావిస్తున్నారా?
లేదు. కేరళను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్నది బిజెపి దీర్ఘకాలిక లక్ష్యంగా వుందన్న వాస్తవాన్ని మేం తోసిపుచ్చం. 2016లో నేమమ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బిజెపి గెలుచుకున్నపుడు కూడా కేరళలో బిజెపి పురోగతి పట్ల ఇదే రకమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆ సమయంలో కూడా ఇది కేవలం కాంగ్రెస్ కుమ్మక్కవడం వల్ల జరిగిందని, ఇది అక్కడికే పరిమితమైన అంశమని మేం చెప్పాం. త్రిస్సూర్ ఇందుకు భిన్నమేమీ కాదు. అదే సమయంలో, ప్రతి నియోజకవర్గంలో బిజెపి ఓటు షేర్ పెరిగిందన్న వాస్తవాన్ని కూడా మేం విస్మరించడం లేదు.
ఈ నేపథ్యంలో, పుంజుకుంటున్న బిజెపిని మీరు ఎదుర్కొంటున్నప్పుడు, ఉన్నత స్థాయిలోని పోలీసు అధికారులు, మీ ప్రభుత్వ సిబ్బందిలో కొందరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను రహస్యంగా కలుసుకుంటు న్నారని, ఆర్‌ఎస్‌ఎస్ పట్ల సిపిఎం మెతక ధోరణితో వ్యవహరిస్తోందనే ఆరోపణలపై మీరు ఎలా స్పందిస్తారు?
వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం ఎల్లప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను, ఇతర హిందూత్వ శక్తులను గట్టిగా వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. వారికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలవడంలో మా కార్యకర్తల్లో పలువురు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇటువంటి వదంతులను కేరళలో ఎవరూ నమ్మరు. ఎందుకు ఇలాంటి ఆరోపణలు తలెత్తుతున్నాయో, వాటి వెనుక గల కారణాలను మేం గ్రహించాలి. కేరళ జనాభాలో మైనారిటీలు గణనీయ సంఖ్యలో వున్నారు. దీర్ఘకాలంగా ఈ కమ్యూనిటీలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ వైపే వున్నాయి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. మైనారిటీ గ్రూపులు ఎల్‌డిఎఫ్‌కు మద్దతిస్తున్నాయి. దీనివల్ల ఎన్నికలపరంగా తమకు దెబ్బ అని తెలుసుకుని యుడిఎఫ్, మేం ఆర్‌ఎస్‌ఎస్ పట్ల మెతక ధోరణితో వ్యవహరిస్తున్నామనే తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగానే ప్రయత్నిస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. మతోన్మాద విచ్ఛిన్నకర ధోరణులను రెచ్చగొడుతూ మరికొన్ని తీవ్రవాద శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ముస్లిం తీవ్రవాద శక్తులకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఈ శక్తులు మేం ముస్లింలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నామని చూపించడానికి యత్నిస్తుంటాయి. ఉదాహరణకు, గత ఐదేళ్లలో మలప్పురం జిల్లా నుండి రాష్ట్ర పోలీసులు రూ.123 కోట్ల విలువైన 150కిలోల బంగారం, హవాలా మనీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు అంతా ప్రభుత్వ వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ఉద్దేశించినది. మీరు ప్రస్తావిస్తున్న ఆరోపణలన్నీ కూడా మా ప్రభుత్వం తీసుకుంటున్న అటువంటి చర్యలకు రియాక్షనే. అన్వర్‌కు సంబంధించినంతవరకు ఆయన చెప్పేవాటిపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మేం ఇప్పటికే ఏర్పాటు చేశాం.
కేంద్ర కమిటీ సభ్యుల వయో పరిమితిని 23వ పార్టీ మహాసభ నిర్దేశించింది. 75ఏళ్లు పైబడిన కేంద్ర కమిటీ సభ్యులు ఇక రిటైరై యువతకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని, కేరళలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోగా మీరు కూడా వైదొలగుతారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు. ఒక వ్యక్తి ఇలాంటివి నిర్ణయించలేరు. సమిష్టి నిర్ణయాలపై పార్టీ పనిచేస్తుంది. వయో పరిమితిని మేం కొనసాగిస్తాం. ఇక నా విషయానికి వస్తే నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీనే. పార్టీ కోసం, అలాగే స్థూల ఏకాభిప్రాయం కోసమే నేను పనిచేస్తున్నాను.
ప్రతిపక్ష పార్టీల మధ్య వారధిగా సీతారాం ఏచూరి వ్యవహరించారని, పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించడం వల్లే ఇండియా బ్లాక్ రూపకల్పన ఆయన చేయగలిగారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చే వ్యక్తి ఇతర పార్టీలతో వ్యవహరించే విషయంలో ఏచూరి మాదిరిగా వుంటారని మీరు భావిస్తున్నారా
సీతారాం ఏచూరికి గల సామర్ద్యం నిరుపమానమైనది. సైద్ధాంతిక విభేదాలతో నిమిత్తం లేకుండా ఆయన ఎవరినైనా కలుసుకోగలరు, మాట్లాడగలరు. ప్రతి ఒక్కరితో సన్నిహితంగా పనిచేయగలరు. ప్రస్తుత భారత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసికట్టుగా పనిచేయడం అత్యంత కీలకం. అవసరం కూడా. ఇండియా బ్లాక్ బ్యానర్ కింద ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేయడాన్ని, పరస్పరం సహకరించుకోవడాన్ని మేం కొనసాగిస్తాం. సీతారాం ఏచూరికి వారసుడిగా వచ్చే వ్యక్తిని ఆయనతో పోల్చాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించగల సమర్ధుడైన, ఉత్తమ వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకోవాలి. ఇందుకు సంబంధించి కొన్ని పద్ధతులు, విధి విధానాలు ఉన్నాయి.
జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. ఈ అంశంపై మీ ప్రభుత్వం, సిపిఎం వైఖరి ఏమిటి?
ఇలాంటి ప్రతిపాదనను మేమెంత మాత్రమూ అంగీకరించం. ఎందుకంటే మన రాష్ట్రాల్లో రాజకీయ వైవిధ్యతను ఇది విస్మరిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల షెడ్యూళ్లను కలపడానికి ఎలాంటి హేతుబద్ధత కానీ, సమంజస సత్యంకానీ లేదు. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వ పదవీ కాలాన్ని మీరెలా కుదిస్తారు? కేవలం షెడ్యూల్ కోసం కట్టుబడి చేస్తారా? ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం.