- నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- పతంజలి ఎండి బాలకృష్ణకు కూడా..
న్యూఢిల్లీ : పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు, యోగా గురువు రాందేవ్ బాబాకు కేరళలోని జిల్లా కోర్టు షాకిచ్చింది. బాబాతో పాటు, ఆ సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్యవిధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల నేపథ్యంలో కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ నిర్వహిస్తోంది. ఈ నెల 1న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారిద్దరూ హాజరు కాలేదు. దీంతో బాబా రాందేవ్, బాలకృష్ణలపై కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15న తిరిగి విచారణ చేపట్టనున్నట్టు వివరించింది. విచారణకు హాజరు కోసం ఇద్దరిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనల నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయిన విషయం తెలిసిందే. ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాందేవ్ బాబాపై దేశంలోని పలు వైద్య సంఘాలు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే. తాజాగా కోర్టు తీర్పుతో మార్కెట్‌లోనూ పతంజలి విశ్వసనీయత దెబ్బతిని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.