Kerala: డ్రగ్స్‌కు జీవితాంతం దూరంగా ఉంటాం

టీచరమ్మకు విద్యార్థుల ‘వీడ్కోలు’ కానుక
చిన్నారులకు కేరళ సిఎం పినరయి విజయన్‌ ప్రశంస
ఇడుక్కి : కేరళలోని ముస్లిం ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఎంఇఎస్‌) స్కూల్‌ విద్యార్థులు క్లాస్‌ టీచర్‌కు విన్నూతమైన వీడ్కోలు కానుక ఇచ్చారు. జీవితాంతం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ టీచర్‌పై ప్రమాణం చేసి మాట ఇచ్చారు. విద్యార్థులు ఇచ్చిన కానుకపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం విద్యార్థుల చర్యను ప్రశంసించారు.
కేరళలోని ఇడుక్కి జిల్లా వందన్మేడు వద్ద ఉన్న ముస్లిం ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఎంఇఎస్‌) హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో సైనబా బివి టీచర్‌గా పనిచేశారు. 9వ తరగతి బి సెక్షన్‌కు బాధ్యతలు నిర్వహించిన ఆమె మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా తరగతిలోని 45 మంది విద్యార్థులు టీచర్‌ తలపై చేయివేసి మాదక ద్రవ్యాలకు జీవితాంతం దూరంగా ఉంటామని మాట ఇచ్చారు. దీనికి గురించి టీచర్‌ మాట్లాడుతూ విద్యార్థులంగా ఈ ప్రతిజ్ఞలో ఉత్సాహంగా పాల్గన్నారని తెలిపారు. ‘మాదక ద్రవాల్యకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలనే ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది. ప్రస్తుతం మన సమాజంలో మాదక ద్రవ్యాలు తీవ్రమైన సమస్య. నేను ఒక అర్థవంతమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను’ అని తెలిపారు. సైనబా బివి 2021 రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గెలుచుకున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాల్లో చురుగ్గా పాల్గన్నారు.

సిఎంసహా పలువురి ప్రశంసలు
విద్యార్థుల చర్యను తల్లిదండ్రులతో పాటు సిఎం, రాష్ట్రవ్యాపంగా విద్యావేత్తలు, పిల్లల హక్కుల న్యాయవాదులు ప్రశంసించారు. విలువ ఆధారిత విద్య, ప్రజారోగ్య అవగాహనకు ఈ చర్య దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. మాదకద్రవ్య రహిత సమాజం పట్ల ప్రేమ, నిబద్ధతకు స్ఫూర్తిదాయకమైన చర్య అని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ‘ఇటువంటి చర్యలు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటంలో మనందరినీ ప్రేరేపిస్తాయి’ అని పేర్కొన్నారు.

➡️