రెగ్యులర్‌ వేతన ఉద్యోగాల్లో కేరళ రికార్డ్‌

Dec 1,2024 07:20 #keral jobs, #Kerala record

కొచ్చి : రెగ్యులర్‌ వేతనాల ఉద్యోగాల్లో గత ఐదేళ్ళ కాలంలో కేరళ అధిక వృద్ధిని సాధించిందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉపాధి రంగం నిరాశాజనకమైన రీతిలో వున్న తరుణంలో ప్రధాన రాష్ట్రాలన్నింటిలోకి కేరళలోనే ఈ పురోభివృద్ధి చోటు చేసుకుందని పేర్కొంది. 2018-19 నుండి 2023-24 మధ్య కాలంలో కేరళలో రెగ్యులర్‌ వేతన జీవుల వేతనాల్లో 6.2 పర్సంటేజ్‌ పాయింట్లు పెరిగాయి. ఇదే సమయంలో జాతీయ సగటు 2 పర్సంటేజ్‌ పాయింట్లు తగ్గాయి.
ఉపాధి, వేతన ప్రామాణికాలకు సంబంధించి 28 రాష్ట్రాల వ్యాప్తంగా కార్మికుల గణాంకాలను విశ్లేషిస్తూ స్టేట్‌ లేబర్‌ ఫోర్స్‌ డైజెస్ట్‌ ఒక సమగ్ర విశ్లేషణ ఇచ్చింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌), ఇతర వనరుల నుండి వచ్చిన డేటాను ఈ నివేదిక ఉపయోగించుకుంది. 2023-24లో కేరళలో రెగ్యులర్‌ వేతనాలు పొందే కార్మికులు 38.9 శాతం మంది వున్నారని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో సీనియర్‌ విశ్లేషకులు పరస్‌ జస్రారు తెలిపారు. 2018-19లో కేరళలోని మొత్తం ఉద్యోగాల్లో ఈ వాటా 32.7శాతంగా వుంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇది రికార్డు. అంటే కార్మికులు రెగ్యులర్‌ వేతనాలు కలిగిన ఉద్యోగాలను పొందుతున్నారని తెలుస్తోంది. జాతీయ సగటు 23.2 శాతం కన్నా ఇది చాలా ఎక్కువని ఆయన పేర్కొన్నారు. కేరళలో ప్రైవేటు రంగంలో వ్యవసాయేతర ఉద్యోగాల వాటా కూడా 2018-19లో 6 శాతం వుంటే 2023-24కు వచ్చేసరికి 8.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ప్రభుత్వ రంగంలో కార్మికుల వాటా కూడా 12.7 శాతానికి పెరిగింది. వ్యవసాయ కార్యకలాపాల్లో వున్న కార్మికుల నిష్పత్తి 27శాతంగా వుంది. ఆ తర్వాత స్థానంలో వాణిజ్య, రవాణా-గిడ్డంగి రంగాల్లో వరుసగా 21.3, 13.4శాతాలుగా వున్నాయి. 2023-24లో ప్రధానంగా ఉపాధి కల్పించింది తయారీ రంగమే, 9.9 శాతం మేర కార్మికులకు ఉద్యోగాలిచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.

➡️