కొచ్చి : ముండకై-చురల్‌మల కొండచరియల విపత్తుపై దాఖలైన సుమోటో పిటిషన్‌ను కేరళ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును వచ్చే వారం పరిశీలిస్తామని కోర్టు ప్రకటించింది. కొండచరియలు విరిగిపడిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్రం తేల్చిచెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించి కేంద్రం ఇచ్చిన లేఖను ప్రభుత్వం ముందుంచింది. వాయనాడ్‌లో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని అమికస్ క్యూరీ రంజిత్ థంపన్ గతంలో నివేదిక సమర్పించారు. ఈ అంశంపై తన వైఖరిని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిపుణుల కమిటీ సంప్రదింపులు జరుపుతోందని కేంద్రం గతంలోనే సమాధానం ఇచ్చింది. అయితే, వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం కేరళకు ఇటీవల తెలియజేసింది. కేంద్ర హోంశాఖ, సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఢిల్లీలోని కేరళ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేవీ థామస్‌కు సమాచారం అందించారు. కేరళ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లన్నింటినీ కేంద్రం తోసిపుచ్చింది.
రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష : కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్
వయనాడ్ కొండచరియలు విరిగిపడిన బాధితులకు సహాయాన్ని అందించడానికి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ తీవ్రంగా విమర్శించారు. జూలై 2024లో జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గల్లంతు అయ్యారు. విపత్తు తీవ్రతగా ఉన్నప్పటికీ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి, అవసరమైన సహాయాన్ని అందించాలని కేరళ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని బాలగోపాల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రం పట్ల వివక్షగా వర్ణించారు. కేరళ భారతదేశంలోనే ఉందని ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందని బాలగోపాల్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. కేరళ ప్రజల పట్ల కేంద్రం అవమానకరంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సహాయం అందించడానికి నిరాకరించడం రాష్ట్రానికి వ్యతిరేకంగా రాజకీయ పక్షపాతాన్ని సూచిస్తుందని బాలగోపాల్ పేర్కొన్నారు.