న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన తాజా హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ దుమారం రేపింది. మణిపూర్‌లో గత 18 నెలలుగా హింస జరుగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. ఈ హింసలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం వల్ల దాదాపు లక్షమంది ప్రజలు నిరాశ్రయులై.. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు అని ఖర్గే రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్‌పార్టీపై విరుచుకుపడ్డారు. మణిపూర్ హింసపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయంగా లబ్ధిపొందేందుకు చూస్తోందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైనందువల్లే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని నడ్డా చెప్పుకొచ్చారు. భారతదేశ పురోగతిని అడ్డుకునేందుకు విదేశీ శక్తుల బంధాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించడం ఆందోళనకరం. ప్రజలను విభజించి ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించేందుకు పన్నిన వ్యూహంలో భాగమే ఇదని ఆయన అన్నారు. విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన విషయం ఖర్గే మరిచిపోయినట్లు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలా మోడీ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలు ఇవ్వలేదని, ప్రత్యేకించి మణిపూర్‌లో పేదరికం తగ్గిందని, 2013లో 20 శాతంగా ఉన్న పేదరికం… 2022నాటికి ఐదు శాతానికి తగ్గిందని నడ్డా చెప్పుకున్నారు.