Kolkata case :50మంది సీనియర్‌ డాక్టర్ల రాజీనామాలు

  • జూనియర్‌ డాక్టర్ల నిరశనకు సంఘీభావం

కోల్‌కతా : విధుల్లో వుండగా అత్యాచారానికి, హత్యకు గురైన జూనియర్‌ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరశన చేపట్టిన జూనియర్‌ డాక్టర్లకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆర్‌.జి.కర్‌ ఆస్పత్రికి చెందిన దాదాపు 50మంది సీనియర్‌ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల హెడ్‌ల సమావేశం ఉదయం జరిగిందని, అందులో మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో తమ సహచరులు తీసుకున్న నిర్ణయాన్నే తాము కూడా అనుసరించాలని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ ఆస్పత్రికి చెందిన సీనియర్‌ డాక్టర్లు యోచిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని జాయింట్‌ ప్లాట్‌ఫారం ఆఫ్‌ డాక్టర్స్‌ కూడా వారికి సంఘీభావం ప్రకటించింది. అవినీతిమయంగా మారిన ఆరోగ్య వ్యవస్థకు స్వస్తి పలకాలని వారు కోరుతున్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జూనియర్‌ డాక్టర్లు ఆమరణ నిరశన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ఇంతవరకు సంబంధిత అధికారుల నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదని ప్లాట్‌ఫారమ్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. నిరశనలో వున్న వారి ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, రోగులతో స్నేహంగా మెలిగే వ్యవస్థను తీసుకురావాలని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము వారికి సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో వున్న వారు కూడా సముచితమైన కార్యాచరణ చేపట్టాలని ప్లాట్‌ఫారమ్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ కోరింది. విధుల్లో చేరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఏడుగురు డాక్టర్లు మంగళవారం కూడా ఆమరణ నిరశన కొనసాగించారు.

➡️