కోల్‌కతా : ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో సిబిఐ ఆదివారం సోదాలు ప్రారంభించింది. ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్‌జి కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
సిబిఐకి చెందిన సుమారు ఏడుగురు అధికారులు ఉదయం 8.00 గంటల నుండి బెలియాఘట నివాసంలో ఘోష్‌ని విచారిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలతో అధికారులు ఉదయం 6.00 గంటలకు ఘోష్ నివాసానికి చేరుకున్నారు. అయితే సుమారు గంటన్నరపాటు అధికారులు వేచిచూసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో సిబిఐ అధికారుల బృందం ఆస్పత్రిలోని ఘోష్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఇన్‌స్టిట్యూట్ క్యాంటీన్‌ను కూడా పరిశీలించింది. ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతికి పాల్పడినట్లు గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఫిర్యాదు చేశారు.
పేషెంట్స్‌కు అవసరమైన సామాగ్రిని సరఫరా చేసేవారి నివాసాలు, కార్యాలయాలపై కూడా సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం దాడులు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, ఆస్పత్రి వైస్ ప్రిన్సిపల్ వశిష్ట్ మరియు వైద్య సంస్థ ఫొరెన్సిక్ విభాగానికి చెందిన మరో ప్రొఫెసర్, ఇతరులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సిబిఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఆస్పత్రి ఆవరణలో నిషేధపు ఉత్తర్వులు పొడిగింపు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మరియు ఆస్ప్రతి పరిసర ప్రాంతాల్లో నిషేధపు ఉత్తర్వులను కోల్‌కతా పోలీసులు మరో వారం రోజులు పొడిగించారు. నిర్దేశిత ప్రాంతంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశం కాకూడదని మొదట ఆగస్ట్ 18 వరకు నిషేధపు ఉత్తర్వులు విధించింది.
బెల్గాచియా రోడ్-జె కె మిత్ర క్రాసింగ్ నుండి ఉత్తర కోల్‌కతాలోని శ్యాంబాజార్ ఐదు పాయింట్ల క్రాసింగ్‌లోని కొన్ని ప్రాంతాల వరకు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (2) విధించినట్లు కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.