న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ వైద్యుల నిరసనకు ఢిల్లీ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా బుధవారం ఢిల్లీ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం 6.00 గంటలకు జవహర్‌లాల్ నెహ్రూ (జెఎల్‌ఎన్) స్టేడియంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎయిమ్స్‌కి చెందిన రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) తెలిపింది. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసి) వైద్యులు ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. విధులు నిర్వహిస్తూనే బుధవారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు వైద్యులు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎంఎఎంసి ఆర్‌డిఎ అధ్యక్షురాలు అపర్ణా సేతియా ఓ ప్రకటనలో తెలిపారు. బెంగాల్ వైద్యుల నిరసనకు మద్దతుగా ఎంఎఎంసి కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
గురుతేజ్ బహదూర్ (జిటిబి) ఆస్పత్రి వైద్యులు నల్ల రిబ్బన్‌లతో విధులకు హాజరయ్యారు. నల్ల రిబ్బన్లతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని, ఇటువంటి క్రూరమైన హింసాత్మక ఘటన పట్ల మౌనంగా ఉండేది లేదని జిటిబి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్‌ఎఐఎంఎ) పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. వైద్యుల పరిస్థితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం, గౌరవం, భద్రత కోసం పోరాడుతున్న బెంగాల్ జూనియర్ వైద్యులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 5 నుండి ఏడుగురు జూనియర్ వైద్యులు కోల్‌కతాలో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారికి సంఘీభావంగా ఆర్‌జికర్ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కోల్‌కతా అభయ కేసులో న్యాయం కోసం ఆగస్ట్ 9 నుండి జూనియర్ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు.