Kuki-Zo MLAs : కేంద్రం నివేదిక అసత్యం, కోర్టును తప్పుదోవ పట్టించేది

ఇంఫాల్‌ : మణిపూర్‌ అల్లర్లపై కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక పూర్తిగా అసత్యమని పది మంది కుకీ ఎమ్మెల్యేలు ఆదివారం పేర్కొన్నారు. ఈ నివేదిక కోర్టును తప్పుదోపపట్టించడమేనని మండిపడ్డారు. గతేడాది మే 3 నుండి తాము ముఖ్యమంత్రిని ఒక్కసారి కూడా సమావేశం కాలేదని, భవిష్యత్తులో కూడా సమావేశమయ్యే ఆలోచన లేదని కుకీలో ఓ ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌లో హింసకు ప్రధాన సూత్రధారి ఆయనేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మణిపూర్‌ సిఎం కుకీ ఎమ్మెల్యేందరితో సమావేశమయ్యారని, రాష్ట్రంలో శాంతిపరిస్థితులను నెలకొల్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారని నవంబర్‌ 8న జరిగిన సుప్రీంకోర్టు విచారణ సమయంలో తాము సంతకం చేసిన నివేదికను సొలిసిటర్‌ జనరల్‌ సమర్పించినట్లు తెలుసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా తప్పుడు నివేదిక అని, కోర్టును తప్పుదారిపట్టించే అంశమని తెలిపారు.

నవంబర్‌ 7న జోసాంగ్కిమ్‌ హ్మార్‌ను క్రూరంగా హత్య చేసి,దహనం చేయడంతో కుకీలపై హింసాకాండ చేపట్టారని అన్నారు. జిరిబామ్‌ జిల్లాలో భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ, ఓ మహిళను మైతీ మిలిటెంట్లు అమానుషంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేపట్టకుండా, నివేదిక సమర్పించిన సొలిసిటర్‌ జనరల్‌ అనైతిక ప్రవర్తనను కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

మణిపూర్‌లో హింసను ప్రేరేపించడంలో సిఎం కీలక పాత్ర పోషిస్తున్నారన్న వాదనను రుజువు చేసేందుకు ఆడియో టేపులను సమర్పించాలని కుకీ సంస్థ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కుకీ ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి కలుస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు మౌఖికంగా తెలిపారు.

➡️