న్యూఢిల్లీ : తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ ఎంపి కుమారి సెల్జా పేర్కొన్నారు. ఆమె బిజెపిలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, సెల్జా కాంగ్రెస్‌లోనే ఉంటానని పునరుద్ఘాటించారు.
దళిత నేత పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రతి కమ్యూనిటీకి కొన్ని అంచనాలు ఉంటాయని, ఇవన్నీ రాజకీయాల్లో భాగమేనని అన్నారు. కమ్యూనిటీలో ఏ ఒక్కరూ పూర్తి, ప్రత్యేక నాయకులు కాలేరని, కానీ నాయకుని ప్రతి చర్యను కమ్యూనిటీ పరిశీలిస్తుందని అన్నారు. పార్టీ నుండి సెల్జా వెళ్లరు, వెళ్లబోరు, అసలు ఎందుకు వెళ్లాలని అన్నారు. పలు అనైతిక చర్యలకు ఢిల్లీ కేంద్రంగా మారిందని, అయితే తానెంటో తన రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసునని అన్నారు.
సెల్జాకు పార్టీ తగిన గౌరవం ఇవ్వనందున ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ కొందరు బిజెపి నేతలు హర్యానా ఎన్నికల ప్రచారంలో ఊహాగానాలకు తెరలేపారు. హర్యానాలోని మహేంద్రగర్‌లో రాహుల్ గాంధీ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపు వార్తలు మరింత అధికమయ్యాయి.
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.