ఛత్తీస్‌గఢ్‌ ఇనుప ఖనిజం గనిలో పేలుడు.. ఒకరు మృతి

Nov 24,2023 13:32 #Chhattisgarh, #IED blast

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని ఇనుప గనిలో శుక్రవారం ఐఇడి పేలుడు జరిగింది.  ఈ ఘటనలో ఓ కార్మికుడు మరణించగా, మరో కార్మికునికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం మరో కార్మికుడు గల్లంతైనట్లు వెల్లడించారు.

రాజధాని రాయ్‌పూర్‌కి  350 కి.మీ దూరంలో ఉన్న ఛోటే డోంగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆమ్‌ దాయ్  ఘాటి ఇనుప ఖనిజం గనిలో ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు కార్మికులు ఖనిజాన్ని వెలికి తీసేందుకు గనిలోకి వెళ్లారని, అదే సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఇడి పేలిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు  తెలిపారు. జయస్వాల్‌ నెకో ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (జెఎన్‌ఐఎల్‌) కి అమ్‌ దాయ్  ఘాటిలోని ఇనుప ఖనిజం గనిని కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టును మావోయిస్టులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మృతుడిని రితేష్‌ గగ్డాగా గుర్తించామని అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఉమేష్‌ రాణాను స్థానిక ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. గల్లంతైన మరో కార్మికుడు శ్రవణ్‌ గగ్డా కోసం గాలిస్తున్నామని అన్నారు.

➡️