పంజాబ్‌లో భారీ కిసాన్‌ మహా పంచాయత్‌

Jan 10,2025 01:22 #Kisan Maha Panchayat. Punjab
  • మార్కెటింగ్‌ విధాన ముసాయిదాకు వ్యతిరేకంగాఅసెంబ్లీల్లో తీర్మానం చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ, జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధాన ముసాయిదాను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన రోజు రోజుకు ఉధృతం అవుతోంది. గురువారం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పంజాబ్‌లోని మోగాలో భారీ కిసాన్‌ మహా పంచాయతీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, రైతుల వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని కిసాన్‌ మహా పంచాయతీ పిలుపు ఇచ్చింది. అలాగే ఎస్‌కెఎంకి చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ నెల 10న శుక్రవారం శంభు, ఖన్నౌరి రైతుల ఆందోళన కేంద్రాలను సందర్శించాలని మహాపంచాయతీ తీర్మానం చేసింది. శంభు, ఖన్నౌరి సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను 15న పాటియాలాలో జరిగే సంయుక్త సమావేశానికి ఆహ్వానించనున్నారు. నవంబర్‌ 26 నుండి ఖన్నౌరిలో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ప్రాణాలకు ముప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మహాపంచాయతీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మొండి వైఖరి కారణంగా దల్లేవాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం ప్రతులను 13న అన్ని గ్రామాల్లో దగ్ధం చేయనున్నారు.

దుర్మార్గమైన ఈ మార్కెటింగ్‌ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇందులో ముందడుగు వేయాలని, ఈ విషయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకటనను మహాపంచాయతీ స్వాగతించింది. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దానిని తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలని కూడా డిమాండ్‌ చేసింది. వేలాది మంది హాజరైన మహా పంచాయతీలో ఎస్‌కెఎం బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, రాకేష్‌ టికాయత్‌, పి. కృష్ణ ప్రసాద్‌, దర్శన్‌పాల్‌, హర్మీత్‌ సింగ్‌ తదితరులు మాట్లాడారు. ఎస్‌కెఎం తన భవిష్యత్తు కార్యచరణను ఈ నెల 24, 25 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటిస్తుంది.

➡️