Lebanon : భారతీయులు లెబనాన్‌ విడిచి వెళ్లండి : భారత విదేశాంగ శాఖ

బీరూట్‌ : గత మూడు రోజుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌ని విడిచి వెళ్లండని అక్కడున్న భారతీయులకు భారత విదేశాంగ శాఖ సలహా ఇచ్చింది. ఈ మేరకు బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో ఉంటున్న ప్రజలు లెబనాన్‌కు వెళ్లవద్దని కూడా సూచించింది. జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే లెబనాన్‌లో ఉన్న భారతీయుల్ని విదేశాంగ శాఖ హెచ్చరించింది. అక్కడ భారతీయులు ఇ మెయిల్‌ email ID: [email protected] ద్వారా లేదా ఎమర్జెన్సీ ఫోన్‌ నంబర్‌ 96176860128 ద్వారా బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ తెలిపింది.
కాగా, ఈ వారం ప్రారంభంలో లెబనాన్‌లో పేజర్‌ దాడులు జరిగాయి. అనంతరం ఇజ్రాయిల్‌ సైన్యం దక్షిణ లెబనాన్‌, రాజధాని బీరూట్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లెబనాన్‌లో మూడు వేల మంది భారతీయులు ఉన్నారు.

➡️