ఐదేళ్లలో 47 టీవీ ఛానళ్ల లైసెన్సులు రద్దు

న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఐదేళ్లలో 47 టీవీ ఛానళ్ల లైసెన్సులను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇటీవల రాజ్యసభలో సిపిఎం ఎంపి వి.శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ సమాధానంలో వెల్లడించారు. గత ఐదేళ్లలో 110 ఛానళ్లకు కొత్త లైసెన్సులు ఇవ్వగా 269 లైసెన్సులు రెన్యూవల్‌ అయ్యాయి. 34 ఛానెల్స్‌ లైసెన్స్‌ దరఖాస్తును తిరస్కరించినట్లు మంత్రి తెలిపారు. చారిత్రాత్మక రైతుల సమ్మె జరిగిన 2020-21లో అత్యధిక సంఖ్యలో లైసెన్స్‌లు రద్దు చేశారు. దీనిపై శివదాసన్‌ మాట్లాడుతూ చానళ్లు, ఇతర మీడియాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి సవాల్‌ అని విమర్శించారు. లైసెన్స్‌ రద్దు భయంతో మీడియా కూడా కేంద్ర విధానాలను విమర్శించేందుకు భయపడుతోందన్నారు. మీడియా లైసెన్సింగ్‌ అధికారాన్ని ‘ఇండియన్‌ బోర్డ్‌ ఆఫ్‌ మీడియా సర్వీసెస్‌’ అనే స్వతంత్ర కమిటీకి బదిలీ చేయాలని కోరుతూ శివదాసన్‌ రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లును ప్రవేశపెట్టారు.

➡️