lightning strikes : ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు గురై 38 మంది మృతి

లక్నో : గతకొన్నిరోజులుగా భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఒక్కరోజే పలు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై 38 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఇక సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగరాజ్‌లో నలుగురు మరణించారు. ఇక పిడుగుపాటుకు అనేకమంది గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటు వల్ల ఎక్కువమంది ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోనే మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువమంది 13 నుండి 15 సంవత్సరాల మధ్య వయసుగలవారేనని అధికారులు తెలిపారు. ఇదే జిల్లాలో పొలంలో పని చేస్తున్న సమయంలో పిడుగు పడడం వల్ల ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద తలదాచుకున్న మహిళ పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందింది. ఔరయ్యా జిల్లాలో వర్షం కురుస్తున్న సమయంలో మామిడిచెట్టు కింద తలదాచుకున్న 14 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. డియోరియో జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. పొలానికి వెళ్తున్న ఓ ఐదేళ్ల చిన్నారిపై పిడుగుపడడంతో ఆ చిన్నారి కూడా మృతి చెందాడు. ఇక ఆ రాష్ట్రంలో ప్రధాన నగరమైన వారణాసిలో పిడుగుపాటుకు ఇద్దరు అన్నదమ్ములు గాయపడ్డారు. ఇందులో ఒక సోదరుడు మృతి చెందగా.. మరొక సోదరుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రతాప్‌గఢ్‌ జిల్లా అధికారులు ఆసుపత్రికి తరలించారు.

➡️