- మోడీ ప్రభుత్వ తీరుపై నిపుణుల విమర్శలు
న్యూఢిల్లీ : నూతన ఆదాయపన్ను బిల్లులో ఎన్నికల బాండ్ల నిబంధనలను చేర్చడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. దానిని మరో రూపంలో తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని నిపుణులు విమర్శిస్తున్నారు. నూతన ఆదాయపన్ను బిల్లులోని 8వ షెడ్యూలులో ఎన్నికల బాండ్ల ప్రస్తావన ఉంది. ‘రాజకీయ పార్టీలు, ఎలక్టొరల్ ట్రస్టుల మొత్తం ఆదాయంలో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చేర్చకూడదు’ అని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 1961 సంవత్సరపు ఆదాయపన్ను చట్టం ప్రకారం ఎన్నికల బాండ్ల ద్వారా కంపెనీలు, వ్యక్తుల నుండి వచ్చిన విరాళాల నుండి రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉంది. 64 సంవత్సరాల నాటి ఐటీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపన్ను బిల్లును తీసుకొచ్చింది. చట్టానికి 4000కు పైగా సవరణలు చేసినందున అది సంక్లిష్టంగా మారిందని, అందుకే దానిని సరళీకరించి 622 పేజీల బిల్లును తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ చర్యలు చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు వాటిని సమీక్షించడం, పర్యవేక్షించడం సాధారణంగా జరిగే పనే. అందుకోసం కొత్త బిల్లులో ఎన్నికల బాండ్ల నిబంధనను చేర్చి ఉండవచ్చునని లేదా భవిష్యత్తులో ఆ పథకాన్ని సవరించి మరో దారిలో తీసుకొచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం కూడా కావచ్చునని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ చెప్పారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన సమయంలో కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిని వ్యవస్థీకృత చర్చలు, నిపుణులతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించవచ్చునని ఆయన సూచించారు. అయితే సవరించిన రాజకీయ విరాళాల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం తనకున్న శాసనాధికారాన్ని అట్టే పెట్టుకున్నదని అన్నారు. కొత్త బిల్లులో ఎన్నికల బాండ్ల ప్రస్తావన తేవడం వ్యూహాత్మక నిర్ణయం కావచ్చునని, దీని ద్వారా భవిష్యత్తులో ఎన్నికల నిధులకు సంబంధించిన సంస్కరణలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.
శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ భాగస్వామి రోహిత్ గార్గ్ మాట్లాడుతూ కొత్త ఆదాయపన్ను బిల్లులో చేసిన మార్పులు స్వభావరీత్యా కేవలం నిర్మాణ సంబంధమైనవేనని అన్నారు. నిబంధనలు, సెక్షన్లలో ప్రధాన మార్పులేవీ లేవని చెప్పారు. ‘ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ తీర్పును ప్రతిబింబించేలా సంబంధిత చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎన్నికల బాండ్లు జారీ చేయాల్సి వచ్చినా వాటిని డిడక్షన్‌గా అనుమతిస్తారు. ఏదేమైనా దాతల వివరాలకు బహిర్గతం చేసే అంశాన్ని సంబంధిత చట్టాల కిందే పరిష్కరించాల్సి ఉంటుంది’ అని అన్నారు.
2018లో ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైంది. అప్పటి నుండి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది దఫాలుగా రూ.16,518 కోట్ల విలువైన బాండ్లు జారీ చేసింది. ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా తాను పొందిన స్వచ్ఛంద విరాళాలపై పన్ను మినహాయింపు కోరాలంటే ఆరు షరతులు పాటించాల్సి ఉంటుంది. అందులో ఒక షరతు ప్రకారం…రాజకీయ పార్టీ రెండు వేల రూపాయల కంటే ఎక్కువ విరాళం పొందకూడదు. అయితే అకౌంట్ పేఈ చెక్కు, అకౌంట్ పేఈబ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా అంతకు మించిన మొత్తంలో విరాళం తీసుకోవచ్చు.