- ఢిల్లీ పాదయాత్రలో ఘటన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోమారు దాడికి యత్నం జరిగింది. దక్షిణ ఢిల్లీలో మాలవీయ నగర్‌లోని సావిత్రి నగర్‌లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా ..ర్యాలీలో ఉన్న వ్యక్తి ఒకరు ఆయనపై లిక్విడ్ చల్లారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తరహాలో కేజ్రీవాల్‌పై దాడి జరగడం గడిచిన నెల రోజుల్లో ఇది మూడో సారి. తాజా ఘటనలో లిక్విడ్ చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని మలవీయనగర్‌కే చెందిన అశోక్ ఝాగా గుర్తించారు.
దేశ రాజధానిలో భద్రత కరువు : ఆప్
దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని ఆమాద్మీ పార్టీ విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రే సురక్షితంగా తిరిగే పరిస్థితి నగర వీధుల్లో లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని? దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆ పార్టీ పేర్కొంది. బిజెపి పాలనలో ఢిల్లీ శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తోందని విమర్శించింది. కేజ్రీవాల్‌పై దాడి వెనుక బిజెపి హస్తం ఉందని ఆప్ నేత సౌరభ్ భరద్వాస్ అనుమానం వ్యక్తం చేశారు.