liquor policy scam:కేజ్రీవాల్‌, కవితకు కస్టడీ పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి చెందిన మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మే 7 వరకూ 14 రోజులపాటు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బిఆర్‌ఎస్‌ నేత కె కవిత, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున గోవా ఎన్నికల్లో ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించిన చంద్రప్రీత్‌ సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా మే 7 వరకూ కోర్టు పొడిగించింది. రిమాండ్‌ ముగియడంతో మంగళవారం సిబిఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు ఇద్దరినీ వర్చువల్‌గా హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు విచారణ ఎదుర్కొన్నారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో కోర్టు అనుమతించింది.
కేజ్రీవాల్‌లో తక్కువ మోతాదులో ఇన్సులెన్‌
జైలులో కేజ్రీవాల్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరగడంతో ఆయనకు సోమవారం సాయంత్రం స్వల్ప మోతాదులో ఇన్సులెన్‌ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్‌ ఒంట్లో చక్కెర స్థాయి పెరగడంతో ఆయనకు స్వల్ప మోతాదులో వైద్యులు ఇన్సులెన్‌ ఇచ్చారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా తమకు ఈ వార్త ఎంతో ఆనందం కలిగించిందని, ఇదంతా భగవంతుని ఆశీస్సుల ఫలితమేనని ప్రకటించింది. ఎయిమ్స్‌ వైద్యుల సూచన మేరకు కేజ్రీవాల్‌కు లో-డోస్‌ ఇన్సులెన్‌ రెండు యూనిట్లు ఇచ్చినట్టు తీహార్‌ జైలు అధికారులు వెల్లడించారు.

➡️