Delhi Liquor Scam : లిక్కర్‌ స్కామ్‌ మనీ బిజెపి ఖాతాల్లోకే వెళ్లింది : అతిషి

న్యూఢిల్లీ : ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌ మనీ అంతా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బిజెపి ఖాతాల్లోకే వెళ్లిందని ఢిల్లీ విద్యాశాఖా మంత్రి అతిషి అన్నారు. ఈ స్కామ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇడి గురువారం రాత్రి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతపై మోడీ ప్రభుత్వం చూపుతున్న దారణ వైఖరికి ఆప్‌ నేత అతిషి తీవ్రంగా విమర్శించారు. శనివారం ఈమె మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్‌ స్కామ్‌ డబ్బు బిజెపి ఖాతాల్లోకి వెళ్లింది. ఈ విషయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడిని జెపి నడ్డాను అరెస్టు చేయాలి’ అని ప్రధాని మోడీకి, ఇడికి ఆమె సవాల్‌ విసిరారు. ఇక ఈ సందర్భంగా ‘స్కామ్‌కి సంబంధించి ఇప్పటివరకు ఏ ఆప్‌ నేత వద్ద డబ్బు దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ, ఇడి దర్యాప్తు సంస్థలు రెండేళ్లుగా సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండేళ్లలో డబ్బులు ఎక్కడికి పోయాయనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉన్నాయి. ఆప్‌కి చెందిన నాయకుడి వద్ద కానీ, లేదా మంత్రి వద్ద కానీ ఒక్కరూపాయిని రికరవరీ చేయలేదు.’ అని అతిషి అన్నారు.
అరబిందో ఫార్మా యజమాని శరద్‌ చంద్రారెడ్డి వాంగ్మూలం ఆధారంగానే అరవింద్‌ కేజ్రీవాల్‌ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. లిక్కర్‌ స్కామ్‌కి సంబంధించి నవంబర్‌ 9 2022న శరద్‌ చంద్రారెడ్డిని ప్రశ్నించారు. అయితే తానెప్పుడూ అరవింద్‌ కేజ్రీవాల్‌ని కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఇలా చెప్పిన మరుసటిరోజే అతన్ని ఇడి అరెస్టు చేసింది. అతను కొన్ని నెలలు జైలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన స్టేట్‌మెంట్‌ మారిపోయింది. తాను అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిశానని, ఎక్సైజ్‌ పాలసీ విషయమై తనతో మాట్లాడానని చెప్పారు. దీంతో ఆయనకు వెంటనే బెయిల్‌ మంజూరైంది.
శరత్‌ చంద్రారెడ్డి బిజెపికి 4.5 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను ఇచ్చాడు. ఆపై 55 కోట్ల విలువైన బాండ్లను కూడా ఇచ్చాడు. ఎన్నికల బాండ్ల రూపంలో ఈ మనీ అంతా బిజెపి ఖాతాకే చేరింది అని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను అరెస్టు చేయాలని ప్రధాని మోడీకి, ఇడికి అతిషి సవాల్‌ విసిరారు.

➡️