- ప్రతిపక్షాల వాకౌట్
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి), త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో ఎన్‌ఇపి, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా, రాజ్యసభలో డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. పార్లమెంట్ బడ్జెట్ రెండోవిడత సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రదాన్ తమిళనాడులోని డిఎంకెపై విమర్శలు చేయడంతో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. డిఎంకె, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదాపడింది. పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎం శ్రీ) పథకంపై అడిగిన ఒక ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం రెండు నాల్కల థోరణితో వ్యవహరిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ తప్పుబట్టారు. ఎంఒయుపై సంతకం చేసేందుకు మొదట అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుందన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌సహా పలు బిజెపియేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఈ పథకంపై ఎంఒయుపై సంతకాలు చేయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని చెప్పారు. తమిళనాడు విద్యార్థుల సంక్షేమం పట్ల డిఎంకెకు నిజాయితీ లోపించిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ‘భాషాపరమైన అవరోధాలు కల్పించడం ఒక్కటే వారి పని. వాళ్లు రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్నారు. అది అప్రజాస్వామికం, అనాగరికం’ అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకం అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలని, అలా చేస్తే ఎన్‌ఇపి-2020ని అమలు చేస్తుందన్నారు. ప్రతిగా కేంద్ర ప్రభుత్వం నిధులి స్తుందని పేర్కొన్నారు. దీంతో డిఎంకెతోసహా ప్రతి పక్షాలు ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. దక్షిణాది రాష్ట్రాలను బలిపశువులను చేయొద్దంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. అనంతరం డిఎంకె ఎంపీ కనిమొళి మాట్లాడుతూ మంత్రిపై హక్కుల తీర్మానం ప్రవేశపెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపిపై సంతకం చేయకపోయినా, త్రిభాషా విధానాన్ని ఆమోదించకపోయినా, తమిళనాడులో పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.రెండు వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. డిఎంకె ప్రభుత్వం ఎన్‌ఇపిపై ఆందోళనలు లేవనెత్తుతుందని, ఆ విధానాన్ని పూర్తిగా నిరాకరిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించిన నిధులను ఎన్‌ఇపితో అనుసంధానం చేయకూడదన్నారు. తమ వైఖరిలో మార్పు లేదని, మంత్రి తమను అబద్ధాలకోరులు, అనాగరికులు అని అనడం సిగ్గు చేటని విమర్శించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని, తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ తమను అనాగరికులు అని పిలవడం దారుణమని, దీనిపై తమ నాయకులతో చర్చించి మంత్రిపై ప్రివిలేజ్‌మోషన్ ఇస్తామని తెలిపారు.
తమిళనాడు మూడు భాషల విధానాన్ని అంగీకరించకపోవడంపై సామాజికంగా, రాజకీయంగా ఏకాభిప్రాయం ఉందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. హిందీని బలవంతగా రుద్దడాన్ని తమిళనాడు ఎప్పటికీ అంగీకరించదని, రెండు భాషల ఫార్ములానే తాము అంగీకరిస్తామని చెప్పారు. తమిళనాడులో బిజెపి పదేపదే ఓటమి చెందుతుందని, అయినప్పటికీ తమ సెంటిమెంట్లను గౌరవించడానికి ముందుకు రావడంలేదని ఎద్దేవా చేశారు. దక్షిణాది ప్రజలకు సమాన గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర మంత్రి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తమిళులను అనాగరికులనడం దారుణమని విమర్శించారు. ఈ పదం భారత దేశం గురించి బిజెపి ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేస్తోందని, ఇది ఖండించతగినదని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా అందరం గొంతెత్తుతామని, తమిళ ప్రజలందరికీ సమాన గౌరవం ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
ఓటరు జాబితాపై చర్చ జరగాలి : రాహుల్ గాంధీ
తిరిగి ప్రారంభమైన సభలో జీరో అవర్‌ను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై డిఎంకెతో సహా వివిధ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయన్న అంశాన్ని లేవనెత్తారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఓటరు జాబితాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని రాహుల్ తెలిపారు.
రాజ్యసభలో ఆందోళన
మరోవైపు, రాజ్యసభలో త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. ‘డూప్లికేట్’ ఓటరు ఐడి కార్డులు, ఓటింగ్ శాతం పెంపునకు అమెరికా నిధులు తదితర అంశాలపై ఇచ్చిన నోటీసులను తిరస్కరించడంతో సభ్యులు వాకౌట్ చేశారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ప్రతిపక్షం వాకౌట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి ముందు నిబంధనలను చదువుకోవాలన్నారు. వాళ్లు ఏమాత్రమూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేత సహా ప్రతిపక్ష పార్టీ నేతలు రిఫ్రెషింగ్ కోర్సుకు వెళ్లి నిబంధనలను అవగాహన చేసుకోవాలని అన్నారు. పతిరోజూ ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తుండటం పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్ఠను తగ్గించడమేనని అన్నారు. నిబంధనల కింద ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానం ఇవ్వడం సభ్యుని హక్కు అని అన్నారు. నిబంధనలు మంత్రి చదువుకోవాలని హితవు పలికారు.
సిపిఎం ఎంపి వి.శివదాసన్ మాట్లాడుతూ అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన ఆందోళనలపై చర్చలు జరపాలని డిఎంకెకు చెందిన తిరుచ్చి శివ, పి.విల్లన్, సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సిపిఐ ఎంపీలు సంతోష్ కుమార్, పిపి సునీర్, ఎమ్‌డిఎమ్‌కె ఎంపీ వైకో డిమాండ్ చేశారు. టిఎంసి సభ్యులు సాకేత్ గోఖలే, సాగరికా ఘోష్, కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, అజరు మాకెన్ రాష్ట్రాల్లో బహుళ ‘డూప్లికేట్’ ఓటరు ఐడి కార్డుల జారీని నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ విఫలమవ్వడంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్ సూచీలు నిరంతరం క్షీణించడం వల్ల చిన్న పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టంపై చర్చ జరగాలని ఆప్ ఎంపీ సంజరు సింగ్ డిమాండ్ చేయగా, భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా నిధులు సమకూరుస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై చర్చ జరగాలని ఎస్‌పి ఎంపీ రాంజీ లాల్ సుమన్ డిమాండ్ చేశారు. రూల్ నెంబర్ 267 కింద వివిధ అంశాలపై 12 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి.
నోరు అదుపులో పెట్టుకో… ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంకె స్టాలిన్ హెచ్చరిక
పిఎంశ్రీ పథకం అమలుపై డిఎంకె ప్రభుత్వానికి నిజాయితీ లోపించిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేంద్రమంత్రిని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ‘అహంకార చక్రవర్తి’ అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రమూ గౌరవం లేదని, మంత్రి ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని హితవు పలికారు. తనను తాను ‘కింగ్’గా అనుకుంటూ అహంకారంతో మాట్లాడుతున్న ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ పిఎంశ్రీ స్కీమ్ అమలుకు తాము ముందుకు రాలేమని తమిళనాడు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందని స్టాలిన్ తెలిపారు. నూతన విద్యా విధానం, త్రిభాషా విధానం, పిఎం శ్రీ ఎంఒయులను తమిళనాడు తోసిపుచ్చడంపై ధర్మేంద్ర ప్రధాన్ తనకు రాసిన లేఖను స్టాలిన్ విడుదల చేశారు. డిఎంకె ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం అని, నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబడే బిజెపి నేతల మాదిరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలను అవమానిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన మాటలను ప్రధాని సైతం ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు.