నవంబరు 26లోగా మహారాష్ట్ర ఎన్నికలు : సిఇసి రాజీవ్‌ కుమార్‌

ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 26లోగా నిర్వహించాల్సి వుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ముంబయిలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలు ప్రకటించాలని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఆయన సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా అధికారులందరూ డిప్యుటేషన్‌పై ఎన్నికల కమిషన్‌ పరిధిలో వుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంట్రాక్ట్‌పై తీసుకున్నా, పదవీ విరమణానంతరం పొడిగించినా ఏ నిర్ణయమైనా ఏ కేసుకు ఆ కేసును బట్టే మారుతుందని చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో వున్నారని తేలితే మాత్రం కచ్చితంగా వారిపై చర్యలు వుంటాయన్నారు. ఒకే పోస్టింగ్‌లో మూడేళ్లు దాటిన వారందరినీ వెంటనే బదిలీ చేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సిఇసి కోరారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తక్కువగా ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనైనా పోలింగ్‌ మెరుగుపడేలా చూడాలన్నారు. అసంఘటితరంగ కార్మికులకు, రోజువారీ కూలీలకు ఆ రోజు జీతంతో కూడిన సెలవు ఇస్తే ఓటింగ్‌ శాతం కచ్చితంగా పెరుగుతుందన్నారు.

➡️