ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరురోజులు గడుస్తున్నా .. ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నపై ఇంకా స్పష్టత రాలేదు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలతో బిజెపి అధిష్టానం చర్చలు జరుపుతూనే ఉంది. బిజెపి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బుధవారం షిండే ప్రటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సిఎం పదవి చేపట్టబోరని ఆయన సన్నిహితులు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేబినెట్‌లో భాగమవుతారని ఎమ్మెల్యే, శివసేన (షిండే వర్గం) అధికార ప్రతినిధి శిర్సత్ తెలిపారు.
”షిండే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి ఈ పదవి తగదు” అని శిర్సత్ పేర్కొన్నారు. షిండే నేతృత్వంలోని శివసేన మరో నేతను డిప్యూటీ సిఎం పదవికి నామినేట్ చేస్తుందని ప్రకటించారు.