‘సంభాల్‌ మసీదు’లో యథాతథ స్థితి కొనసాగించండి

Jan 11,2025 00:18 #'Sambal Masjid', #Continue status, #quo
  • యుపి ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
  • కేంద్రానికి, ఎఎస్‌ఐకి నోటీసులు

న్యూఢిల్లీ : సంభాల్‌లోని షాహి జామా మసీదు బావిపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అలాగే, ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ వరకూ ఈ ప్రైవేటు బావి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొవద్దని కేంద్రానికి, భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ)కి, సంభాల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హిందూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మసీదుకు సమీపంలో ఉన్న బావిని పునర్ధురించడాన్ని వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ తాజాగా దాఖలు చేసిన పిటీషన్‌ను శుక్రవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజరు కుమార్‌ ధర్మాసనం విచారించింది. మసీదు కమిటీ తరుపున సీనియర్‌ న్యాయవాది హుఫీజా అహ్మది వాదనలు వినిపించారు. సంభాల్‌ జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ బావిని పునరుద్ధరించారని, ఈ బావి నీటిని ఎప్పటి నుంచో మసీదు కమిటీ ఉపయోగిస్తుందని తెలిపారు. అయితే ప్రాంతానికి ‘హరి మందిర్‌’ అని పేరుపెట్టి ఇక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘అలాంటి కార్యకలాపాలు అనుమతించబడవు. దయచేసి స్టేట్‌స్‌ రిపోర్ట్‌ ఫైల్‌ చేయండి’ అని సమాధానం ఇచ్చింది. బావిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాగా, మొగల్‌ కాలం నాటి మసీదులో సర్వే చేయాలని జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ ఇప్పటికే మరో పిటీషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సర్వే చేయాలనే ఆదేశాల కారణంగా హింసాకాండ, ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది.

➡️